ఎన్నికలంటే జగన్ ప్రభుత్వానికి భయం
పంచాయతీ ఎన్నికలు అంటే జగన్ ప్రభుత్వంకు భయం పట్టుకుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పులివర్తి నాని గారు ఆరోపించారు. మంగళ వారం చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అడ్డ దారిన గెలవటం అలవాటు కనుక ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం వారి ఆటలు సాగవని గ్రహించి ఎన్నికలకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు. ఒక్క చాన్స్ అని అడిగితే నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. ఉద్యోగ సంఘం నేతలపై ఒత్తిడి చేసి ఎన్నికలకు సహకరించమన్న ప్రకటనలు చేయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అవుతుందన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించటం ఎవ్వరితరం కాదని హెచ్చరించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ శ్రీ దొరబాబు గారు మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాను సాకుగా చూపి ఎన్నికలు జరగకుండా అడ్డపడటం దుర్మార్గం అన్నారు. జగన్ పర్యటనకు వేలాది మంది ప్రజలను ఒక్క చోటకు చేర్చటం, ర్యాలీలు చేయటం వల్ల కరోనా వ్యాపించదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కఠారి ప్రవీణ్ పాల్గొన్నారు.